NTV Telugu Site icon

కేసీఆర్‌ కు ఓట్లు, నోట్లు, సీట్లే కావాలి : బీజేపీ మాజీ ఎమ్మెల్యే

NVSS Prabhakar

ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్‌ నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యుల వ్యవహార శైలిని చూసి తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడతున్నారని ఆయన అన్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ధాన్యం సేకరించాలని ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు.

పరిపాలన పూర్తిగా స్తంభించిందని, సీఎం కేసీఆర్‌కు ఓట్లు, నోట్లు, సీట్లు కావాలే తప్ప ప్రజల పాట్లు అక్కరలేదు అంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న కుటుంబ సమేతంగా క్యాంప్ లు పెట్టారని, సీఎం క్యాంపు లో ఉన్న వారితో మాట్లాడుతున్నారు కానీ ధాన్యం కొనుగోలు పై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి క్యాంపు ల్లో కునుకుతున్నాడని, క్యాంపుల పై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారుల పై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని, గవర్నర్ ఐకేపీ సెంటర్ లను సందర్శించాలని ఆయన కోరారు.