NTV Telugu Site icon

KVP Ramachandra Rao: నా ఫాంహౌస్ అక్రమమైతే నేనే కూలుస్తా..

Kvp

Kvp

KVP Ramachandra Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అవి, మూసీ ప్రక్షాళన/ సుందరీకరణను నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను.. ఈ ప్రాజెక్ట్ విషయంలో అటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, వారి పెంపుడు మీడియా పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడేలా చేస్తున్నాయి.. అన్నీ వారి స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే అని ఆయన విమర్శించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని దేశప్రజలందిరికి తెలుసు.. మీ ఆశయాన్ని దెబ్బ తీసే వారి ప్రయత్నాలను ఖండిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అజీజ్ నగర్ లో నా కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఫాం హౌస్ మీద, వారి స్వార్ధం కోసం ప్రతిపక్ష నాయకులు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని కేవీపీ అన్నారు.

Read Also: Hassan Nasrallah: అంత్యక్రియలు జరిగే వరకు రహస్య ప్రదేశంలో నస్రల్లా తాత్కాలిక ఖననం..

అయితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీపై, మన పార్టీపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు నన్ను, నా కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫాం హౌస్ ను పావుగా వాడుకోవడం.. నాకు తీవ్ర మనోవేదన కలిగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. మా ఫాం హౌస్ లో ఏ కట్టడమూ ఎఫ్‌టీఎల్,బఫర్ జోన్ పరిధిలో లేవు.. ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఉన్నా.. నా సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. సంబంధిత అధికారులను వీలు చేసుకొని.. వెంటనే మా ఫాం హౌస్ కు పంపించండి.. చట్ట ప్రకారం అక్కడ ఎఫ్‌టి‌ఎల్, బఫర్ జోన్ల పరిధిని మార్క్ చేస్తే.. ఆ పరిధిలో ఏదైనా కట్టడం ఉంటే.. 48 గంటలలో ప్రభుత్వానికి భారం కాకుండా.. నా సొంత ఖర్చులతో ఆ కట్టడాలను కూలుస్తాం అని వెల్లడించారు.

Read Also: Worlds Billionaires: యుద్ధం ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే తలకిందులైన ప్రపంచ ధనవంతుల జాబితా..

అలాగే, వ్యర్ధాలను తొలగించి, శుభ్రం కూడా చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను అని కేవీపీ రామచంద్ర రావు వెల్లడించారు. అయితే ఈ మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని నా కోరిక.. మార్కింగ్ చేసే సమయం, తేదీ ముందే ప్రకటిస్తే.. నాపై పదేపదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియా కూడా తీరిక చేసుకొని వచ్చి.. ఈ ప్రక్రియని వీక్షించే అవకాశం కలుగుతుంది అన్నారు. ఒక క్రమశిక్షణ, నిబద్దత కల్గిన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను.. నా వల్ల పార్టీకి నష్టం కలిగే ఏ పని చేయను అని పేర్కొన్నారు. ఇది నేను, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు మూడు దశాబ్దాల క్రితం అంటే 1996లోనే మా అంతరాత్మ సాక్షిగా తీసుకున్న నిర్ణయం అని వెల్లడించారు. నా తుది ఊపిరి వరకూ దీనికి కట్టుబడే ఉంటాను.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు చట్టం నుంచి ఏ మినహాయింపులు వద్దు.. చట్టాన్ని తన పని తాను చేసుకోని పోనిద్దాం.. మీ నాయకత్వంలోని మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రావొద్దు.. నాలో ఉన్న కాంగ్రెస్ రక్తం అందుకు అంగీకరించనందునే మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను అని కేవీపీ రామచంద్రరావు తెలిపారు.