Site icon NTV Telugu

Sonia Gandhi: సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ.. సారాంశమిదే..!

Soniagandhi

Soniagandhi

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ రాశారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ లేఖ రాశారు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించిన సంఘటనలు రాష్ట్ర మహిళల ఆత్మ గౌరవాన్ని అవమానించే విధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను బానిసత్వం వైపు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తోందని తెలిపారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అడుగడుగునా మోసం చేస్తోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే తన తీరు మార్చుకోవాలని లేఖలో స్పష్టం చేశారు. విదేశీ మహిళలకు కాళ్లు కడిగించిన ఘటన తీవ్రమైన దుమారానికి, వివాదానికి దారితీస్తోందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు, తల్లులకు, అక్కాచెల్లెళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర మహిళలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Tollywood: అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి 

బుధవారం మిస్ వరల్డ్ పోటీదారులు ములుగు, రామప్ప దేవాలయ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయంలోకి వెళ్లే ముందు అందాల భామలు కాళ్లు కడుక్కుని వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు నీళ్లు పోయడం వివాదాస్పదమైంది. తెలంగాణ మహిళలతో అందాల భామల కాళ్లు కడిగిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ఇది తీవ్ర అవమానకరమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బీఆర్ఎస్ మహిళా నేతలు.. సోనియాగాంధీకి లేఖ రాశారు.

ఇది కూడా చదవండి: S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..

ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో అందాల భామల హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కావాలనే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Exit mobile version