Tragedy: భాగ్యనగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. నగరవ్యాప్తంగా కుండపోతగా వాన పడటంతో పలు ప్రాంతాలు జలమయమవగా, పాతబస్తీలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
మంగళవారం కురిసిన కుంభవృష్టికి చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షం దాటికి రోడ్డుపై కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అయితే, నీరు నిలిచి ఉండటంతో ఆ ప్రమాదాన్ని గమనించని బాధితులు ప్రయాణిస్తున్న ఆటోను పక్కకు నిలిపారు. అనంతరం వారు ఆటోలో నుంచి కిందకు దిగే క్రమంలో రోడ్డుపై పడి ఉన్న సజీవ విద్యుత్ తీగలను తాకారు. దీంతో ఒకరిని కాపాడబోయి మరొకరు.. ఇద్దరూ తీవ్రమైన కరెంట్ షాక్‌కు గురై స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో చాంద్రాయణగుట్ట ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు రోడ్లపై నడిచేటప్పుడు, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

