NTV Telugu Site icon

Police Statement: పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి రెక్కీ చేయలేదు… కుట్ర జరగలేదు..!!

Hyderabad Police

Hyderabad Police

Police Statement: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రెక్కీ నిర్వహించారన్న వార్త కలకలం సృష్టించింది. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పవన్ రెక్కీ వివాదంపై దర్యాప్తు జరపాలని.. ఒకవేళ తెలుగు రాష్ట్రాల వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వం బరిలోకి దిగి విచారణ చేయిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. తాజాగా ఈ అంశంపై హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ లేదా దాడికి కుట్ర జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ముగ్గురిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి ముందు న్యూసెన్స్ చేసింది ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు.

Read Also: YSRCP Leaders: పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారు

పబ్‌కు వెళ్లి తప్పతాగి తిరిగి వస్తుండగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ముగ్గురు యువకులు కారు ఆపారని.. కారు తీయమని అడిగిన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బందితో యువకులు గొడవ పడ్డారని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ముగ్గురు యువకులను విచారించి నోటీసులు జారీ చేశారు. తాగిన మైకంలోనే పవన్ ఇంటి ముందు న్యూసెన్స్ చేసినట్లు యువకులు అంగీకరించారు. కాగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆపిన కారు గుజరాత్ రిజిస్ట్రేషన్‌తో ఉందని తెలిపారు. ఈ కారు సాయికృష్ణ అనే యువకుడికి చెందినదిగా పోలీసులు పేర్కొన్నారు.

మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో ఉన్న తబ్లా రసా పబ్‌ను జనసేన కార్యకర్తలు ముట్టడించారు. నివాస ప్రాంతంలో ఉన్న ఈ పబ్‌ను మరోచోటుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జనసేన కార్యకర్తలు పబ్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.