Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు

Hyderabad

Hyderabad

హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత క్రూరమైన ఘటన వెలుగుచూసింది. గత ఆరు నెలలుగా తనతో కలిసి లివిన్స రిలేషన్ సాగిస్తున్న ఒక 50 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడు నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో తీవ్ర ఆవేశానికి లోనై, చాకుతో ఆమె నాలుకను కోసి పారిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సదరు మహిళ భర్త పదేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఆరు నెలల క్రితం నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారడంతో, ఇద్దరూ పరస్పర అంగీకారంతో గత ఆరు నెలలుగా ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య కొన్ని వ్యక్తిగత విషయాలపై మనస్పర్థలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న అర్ధరాత్రి దాటిన తర్వాత నవీన్, సదరు మహిళ మధ్య ఇంట్లో గొడవ మొదలైంది. మాట మాట పెరిగి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన నవీన్ ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే పదునైన చాకును తీసుకుని ఆమెపై దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను గట్టిగా పట్టుకుని చాకుతో ఆమె నాలుకను కోసేశాడు. మహిళ గట్టిగా కేకలు వేస్తూ రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో నిందితుడు నవీన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. స్థానికులు, పొరుగువారు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గాంధీ ఆసుపత్రి వైద్యుల బృందం ఆమెకు అత్యవసర సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం బాధిత మహిళ ఐసీయూలో చికిత్స పొందుతూ నిలకడగా కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు.