Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
- గణేష్ నిమజ్జనానికి పోలీసుల భారీ ఏర్పాట్లు
- 10 వేల సీసీ కెమెరాలు.. 24 డ్రోన్లతో నిఘా
- 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
- మహిళల భద్రతకు 26 షీ-టీమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion 2026 : హైదరాబాద్ లో వైభవంగా ప్రారంభమైన వినాయక ఉత్సవాల ముగింపు వేడుకలకు, ఈ నెల 25న శుక్రవారం జరిగే మహానిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. మూడో రోజు నుంచే ప్రారంభమైన విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే నగరంలో ప్రశాంతంగా సాగుతుండగా, చివరి రోజు బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్రను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవంతం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ విస్తృత ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, పొరుగు జిల్లాల నుంచి పోటెత్తే లక్షలాది మంది భక్తులు, వేలాది విగ్రహాల రాకను దృష్టిలో ఉంచుకుని బందోబస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, తదితర అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ నలుమూలలా భద్రతా వలయాన్ని పటిష్టంగా తీర్చిదిద్ది, ఎలాంటి చిన్నపాటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా ప్రశాంత వాతావరణంలో లంబోదరుడికి వీడ్కోలు పలికేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటివరకు ఖైరతాబాద్ బడా గణేష్ ను 25 లక్షలు, బాలాపూర్ వినాయకుడిని 15 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నిమజ్జన చివరి రోజున ఈ రెండు ప్రాంతాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. అక్కడ భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటోంది.
Also Read
- Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
- DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
సమగ్ర ముందస్తు కసరత్తు.. శాఖల సమన్వయం
ఉత్సవాల నిర్వహణ కోసం మూడు నెలల ముందు నుంచే పకడ్బందీ కసరత్తును హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించింది. ధూల్‌పేట్, లక్ష్మీదేవిగూడ విగ్రహ తయారీదారులతో మొదలుపెట్టి జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్, జలమండలి, రవాణా, అగ్నిమాపక, వైద్యారోగ్య, హైడ్రా, సమాచార పౌరసంబంధాలు, హెచ్ఎండీఏ తదితర ప్రభుత్వ విభాగాలతో పాటు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతోనూ హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు పలు ధఫాలుగా సమన్వయ సమావేశాలను నిర్వహించారు. ఖైరతాబాద్, బాలాపూర్ ఉత్సవ కమిటీలు, పీస్ కమిటీల ప్రతినిధులతో భేటీలు జరిపారు.
ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. గణేశ్ ఉత్సవాలను అత్యంత వైభవంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ నెల 12న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దీనికి కొనసాగింపుగా, ఈ నెల 13న డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అన్ని ప్రభుత్వ విభాగాలతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయి సిబ్బందికి కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖలోని అన్ని విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి విధులను నిర్దేశించడంతో పాటు.. వివిధ శాఖలు, ఉత్సవ నిర్వాహకులతో క్షణక్షణం సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను అందుబాటులోకి తెచ్చాం.
నగరవ్యాప్తంగా పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన మండపాల ఆన్లైన్ విధానం ద్వారా 15,426 దరఖాస్తులు రాగా, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 14,929 మండపాలకు అనుమతులను మంజూరు చేశారు. అనుమతి పొందిన అన్ని మండపాలను ‘జియో ట్యాగింగ్’ చేయడంతో పాటు ప్రమాద నివారణ, విద్యుత్ తీగల రక్షణ జాగ్రత్తలపై తెలుగు, ఆంగ్ల భాషల్లో ముద్రించిన పోస్టర్లను మండపాల వద్ద అతికించారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32,878 విగ్రహాల నిమజ్జనం విజయవంతంగా ముగియగా, అందులో హైదరాబాద్ నగరానికి చెందిన 6,108 విగ్రహాలు ఉన్నాయి. గత 24 గంటల్లోనే నగర పరిధిలోని 2,161 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఉత్సవ సమితులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సంయుక్త రూట్ తనిఖీలు పూర్తిచేసి రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపులు వంటి పనులను పూర్తి చేశారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ
శోభాయాత్రను క్షణక్షణం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ పూర్తిస్థాయిలో రంగంలోకి దించింది. ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలోని కంట్రోల్ రూంకు అనుసంధానించింది. కీలక రహదారులపై డేగకన్ను వేసేందుకు 24 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తోంది. ప్రధాన మార్గాల్లో దాదాపు 100 వరకు హైరైజ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా విగ్రహాల లెక్కింపును చేస్తున్నారు.
శోభాయాత్ర మార్గాల్లోని ఎత్తైన భవనాల పైకప్పులపై అత్యాధునిక బైనాక్యులర్లు, వైర్లెస్ సెట్లతో సిబ్బందిని మోహరించి ప్రధాన కంట్రోల్ రూమ్‌కు పోలీస్ అధికారులు అనుసంధానం చేశారు. బంజారాహిల్స్‌లోని ప్రధాన జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, మొఘల్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటైన ప్రత్యేక కంట్రోల్ రూముల్లో అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు 24 గంటలూ అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తారు. ప్రధాన జలాశయాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్మీ, పర్యాటక శాఖలకు చెందిన నిపుణులైన గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ అంతరాయాలు కలగకుండా మొబైల్, స్టాటిక్ జనరేటర్లు, రాత్రి వేళల్లో నిఘా కోసం వాచ్ టవర్లు, వైద్య సేవల కోసం పారామెడికల్ సిబ్బందితో కూడిన అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలను సిద్ధం చేశారు. వాహనాలు మొరాయిస్తే ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద మెకానిక్‌లు, అదనపు డ్రైవర్లను సైతం అందుబాటులో ఉంచారు.
20 వేల మందితో పహారా.. కేంద్ర బలగాల మోహరింపు
శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ తదితర విభాగాల నుంచి దాదాపు 20 వేల మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇతర జిల్లాల నుంచి గతంలో నిమజ్జన బందోబస్తులో అనుభవమున్న 8,142 మంది అధికారులు, సిబ్బందితో కూడిన 42 ప్లాటూన్లను రప్పించి ఏడు జోన్లకు కేటాయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతల కోసం 4 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) కంపెనీలను చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లలో, 2 సీఆర్పీఎఫ్ కంపెనీలను ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో మోహరించారు. 53 వరకు బీడీ టీంలు ఈ బందోబస్తులో విధుల్లో ఉంటున్నాయి. నగర ప్రవేశ మార్గాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్ వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శోభాయాత్రలో ప్రధాన ప్రాంతాలైన మొజంజాహి మార్కెట్, బషీర్ బాగ్, తదితర ప్రాంతాల్లో ఐజీ/డీఐజీ ర్యాంకు అధికారులను నియమించింది.
ప్రజారోగ్యం, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్ద తీవ్రత కలిగించే పరికరాలు, బాణసంచా కాల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీస్ పూర్తిగా నిషేధం విధించింది. ఈ అంశంపై ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులను అతిక్రమిస్తే పరికరాలను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
మరోవైపు మహిళలు, యువతుల భద్రతకు పెద్దపీట వేస్తూ మూడు షిఫ్టుల్లో 26 షీ-టీమ్స్ బృందాలు విధుల్లో ఉంటాయి. ఉత్సవాలు ప్రారంభమైన సెప్టెంబరు 14 నుంచి ఇప్పటివరకు ఖైరతాబాద్, బాలాపూర్ వంటి రద్దీ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించిన 1,172 మంది ఆకతాయిలను (1,121 మంది మేజర్లు, 51 మంది మైనర్లు) పట్టుకున్నారు. నిమజ్జనం రోజున నేర నియంత్రణ కోసం సీసీఎస్ పరిధిలో 139 మంది సిబ్బందిని 5 సెక్టార్లుగా విభజించి, 25 ప్రత్యేక బృందాలుగా మఫ్టీలో నిఘా ఉంచనున్నారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే డయల్ 112 లేదా షీ-టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కోరుతోంది. హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. “గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా ముగించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం తరఫున అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నగర ప్రజలంతా సంయమనం పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. అయితే, పవిత్రమైన ఉత్సవం పేరుతో కొందరు మితిమీరి అసభ్యకరంగా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు, సభ్యసమాజం హర్షించదగ్గ విషయం అంతకన్నా కాదు. ఇలాంటి విషయాల్లో పోలీసు యంత్రాంగం అత్యంత సీరియస్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, పుకార్లు సృష్టించినా ఉపేక్షించబోం. గౌరవ హైకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే కేటాయించిన జలాశయాల్లో నిమజ్జనాలు చేపట్టాలి. హైదరాబాద్ విశిష్ట సంస్కృతి అయిన ‘గంగా-జమునా తెహజీబ్’ను, సోదరభావాన్ని కాపాడుకుంటూ పోలీసులకు సంపూర్ణంగా సహకరించి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.” అని అన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా సిటీ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే అడ్వజైరీలను ఎప్పటికప్పుడు నగర ప్రజలు ఫాలో కావాలని, అందుకు అనుగుణంగా తమ ప్రయాణాలను చేసుకోవాలని ఆయన సూచించారు. వాహనాల డ్రైవర్ల విషయంలో నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుభవజ్ఞలైన వారిని నియమించుకోవాలని చెప్పారు. మండపం నుంచి నిమజ్జనం వరకు ముందుగానే రూట్ సర్వే చేయాలని, ఇబ్బందులు ఎక్కడున్నాయో ముందే గుర్తుంచుకుని, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసాదాల వితరణ విషయంలో కొందరు అలసత్వంగా వ్యవహారిస్తున్నారని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తాజావార్తలు
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!