Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!

Drugs Apbus

Drugs Apbus

హైదరాబాద్: నగరంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. భోపాల్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ప్రయాణికుల బస్సులో తనిఖీలు చేపట్టి, సుమారు రూ.1.1 కోట్ల విలువైన 1.136 కిలోల మెథాంఫెటమిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు DRI హైదరాబాద్ జోనల్ యూనిట్ (HZU) అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, స్లీపర్ బెర్త్‌ల పరుపుల కింద అత్యంత చాకచక్యంగా దాచిన నాలుగు అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించారు. ఫీల్డ్-టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షించగా, ఆ ప్యాకెట్లలో ఉన్నది నిషేధిత ‘మెథాంఫెటమిన్’ అని నిర్ధారణ అయింది.

అధికారుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు స్లీపర్ బెర్త్‌లలో ప్రయాణించిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బస్సు ఎక్కి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దిగిపోయినట్లు తేలింది. డ్రగ్స్‌ను బస్సులోనే వదిలి వెళ్లడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన 1.136 కిలోల మెథాంఫెటమిన్‌ను ఎన్‌డిపిఎస్ (NDPS) చట్టం, 1985 కింద అధికారులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, హైదరాబాద్‌లో ఎవరికి డెలివరీ చేయాలనుకున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.