యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గత నెల 30న జరిగింది. ఫలితాల కోసం రెండురోజులుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు. హుజురాబాద్ కౌంటింగ్ ప్రారంభమయింది. హుజురాబాద్ మండలంలోని 14 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల లెక్కింపు జరుగుతుంది.
హుజురాబాద్లోని పోతిరెడ్డిపేట తొలి గ్రామం కాగా, కమలాపూర్ మండలం శంభునిపల్లి చివరి గ్రామం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు పంపించిన ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. సాయంత్రం 4 గంటల తర్వాత మొత్తం ఫలితం వెలువడనుంది. ఈ ఉప ఎన్నికల్లో 86.64 శాతంగా పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరగడంతో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీలలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయితే ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందని గులాబీ నేతలు ధీమాతో వున్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో వుంది. ఈవీఎంలు తెరిచి లెక్కింపు ప్రారంభం కానుండడంతో ఏం జరుగుతుందో చూడాలి.