NTV Telugu Site icon

Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆటను ఎలా మార్చారు..?

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ గత తొమ్మిదన్నర ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. నేతలు చేజారిపోవడం, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఇలా పలు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌కి ఎదురులేకుండా పోయింది.

అయితే, వీటన్నింటికి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేకుండా ఎన్నికలకు వెళ్లడం ఒక కారణమైతే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. కర్ణాటక ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పని అయిపోయిందని, బీజేపీ ప్రత్యామ్నాయమని భావించినప్పటికీ, హస్తం పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడింది.

Read Also: Chennur: చెన్నూర్‌లో భారీ ఆధిక్యం దిశగా వివేక్.. వెనుకంజలో బాల్క సుమన్..

అయితే 54 ఏళ్ల రేవంత్ రెడ్డి దక్షిణాదిలో కాంగ్రెస్‌కి మరో రాష్ట్రాన్ని కట్టబెట్టారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ చీఫ్, ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌పై కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఆధిక్యం కనబరుస్తున్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జూలై, 2021లో తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ విజయం కోసం రేవంత్ రెడ్డి గట్టిగా పనిచేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్నప్పటికీ, కర్ణాటక ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి నాయకులంతా కలిసి పనిచేసిన విధంగా.. తెలంగాణలో ఇదే ఫార్మూలాను వర్కవుట్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.

పలు జాతీయ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 80 సీట్లకు పైగా గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారా..? అనే ప్రశ్నకు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని చెప్పారు. తాను హైకమాండ్ ఆదేశాలు పాటిస్తానని అన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం తెలంగాణలో 119 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు కాంగ్రెస్ దాటి అధికారం దిశగా వెళ్తోంది.