Site icon NTV Telugu

Telangana IMD: వేసవిలో రికార్డు వర్షం.. హైదరాబాద్‌లో 3 గంటల వాన..

Hyderabad Hevy Rains

Hyderabad Hevy Rains

Telangana IMD: తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండలు ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మారింది. ఉరుములు, మొరుపులతో వాన బీభత్సాన్ని సృష్టించింది. హైదరాబాద్‌లో మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 10.8, కేపీహెచ్‌పీలో 10.73, సికింద్రాబాద్‌లో 8.4, అల్వాల్‌లో 7, గాజులరామారంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Read also: Tragedy: మేడ్చల్ లో గోడకూలి ఏడుగురు మృతి.. సికింద్రాబాద్ లో కొట్టుకొచ్చిన మృతదేహాలు..

పిడుగుపాటు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు చెట్ల కింద ఉండవద్దని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాకవద్దని కోరారు. శిథిలమైన భవనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100కి కాల్ చేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తొమ్మిది జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. బుధవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

Read also: Sanju Samson: రెండు బౌండరీలు ఇవ్వకుంటే బాగుండు: సంజూ శాంసన్

తక్షణమే సమస్యను పరిష్కరించండి అధికారులను సీఎం ఆదేశం..

రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీటి ఎద్దడి, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయం వంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, సిటీ పోలీస్‌ కమిషనర్‌ కే శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్‌ కో సీఎండీ ఎస్‌ఏఎం రిజ్వీ తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్న కాలనీల్లోని ప్రజలకు అవసరమైన ఆదుకోవాలని సూచించారు.
Farmers Suffering: రైతులను ఆగం చేసిన అకాల వర్షం.. చెల్లాచెదురైన ధాన్యం

Exit mobile version