భానుడి భగభగకు హైదరాబాద్ వాసులు ఉక్కపోతతో సతమతమవుతున్న వేళ… వరుణుడు కరుణించాడు.. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో.. నగరంలోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
నగరంలోని ప్రధాన రహదారులు జలమయమవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం కలిగింది. భాగ్యనగరంలోనే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో… ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.