తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్ , గాజుల రామారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయినపల్లి, అల్వాల్, మారేడుపల్లి, బేగంపేట, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
కరీంనగర్ లోనూ భారీ వర్షం
కరీంనగర్ లో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవగా, భారీ హోర్డింగ్ లు సైతం కుప్పకూలాయి. ఫిబ్రవరిలో నిర్వహించతలపెట్టిన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రచారంలో భాగంగా గీతా భవన్ సెంటర్ లో రాముడి పట్టాభిషేకం భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. విద్యుద్దీప కాంతులతో వెలిగిపోయే ఈ 70 అడుగుల హోర్డింగ్ ఈదురుగాలుల తాకిడికి నేలకొరిగింది. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Read Also: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి బంగారం పట్టివేత
కరీంనగర్ జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. శంకరపట్నం, రామడుగు, చొప్పదండి, జమ్మికుంట, మానకొండూరు, పెద్దపల్లి ప్రాంతాల్లో అకాలవర్షంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ వర్షం, ఈదురుగాలులతో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అటు అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఈ వర్షాలు రైతులను మరింతగా క్షోభకు గురి చేస్తున్నాయి.