హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కురియడంతో రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. మచ్చబొల్లారంలోని అంజనీపూరి కాలనీ లో వరద నీటితో నిండిపోయిన గుంతలో మంజుల అనే మహిళ పడిపోయింది. ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతిలో మహిళ పడిపోయింది. దీంతో.. స్థానికులు చూసి కాపాడటంతో ప్రమాదం తప్పింది. కానీ.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో.. మునిసిపల్ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్, బేగంపేట్, పేరడైజ్, చిలకలగూడ, మారేడ్పల్లి, అడ్డగుట్ట, బోయిన్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాలి లోతు మేర వర్షపు నీరు నిలవడంతో ఆ నీటిలోనే పాఠశాల విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో భారీగా ట్రాఫిక్ జాం అవడంతో.. వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారు.