Site icon NTV Telugu

HCA : జగన్మోహన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..

Jagan Mohan Rao Hca

Jagan Mohan Rao Hca

HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై మల్కాజ్‌గిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కేసులో కీలకమైన రిమాండ్ రిపోర్ట్‌ ఎన్టీవీ చేతికి చేరింది. ఈ రిపోర్ట్‌లో చోటుచేసుకున్న నకిలీ పత్రాలు, ఫోర్జరీలు, నిధుల దుర్వినియోగం, పత్రాలపై సంతకాల ఫోర్జరీ లాంటి అంశాలు హచ్ఛగా వెలుగులోకి వచ్చాయి.

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మే 2024 కంటే ముందే జరిగిన ఘటనల నేపథ్యంలో, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. జగన్మోహన్‌రావు హెచ్‌సీఏ ఎన్నికల్లో నకిలీ పత్రాలు, తప్పుడు అటెస్టెడ్ సంతకాల ఆధారంగా అభ్యర్థిగా నిలిచి, అధ్యక్షుడిగా గెలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయనపై IPC 465, 468, 471, 403, 409, 420 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. గౌలిపురా క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణాయాదవ్, తమ క్లబ్‌కు శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు ఎలాంటి సంబంధం లేదని వాంగ్మూలమిచ్చారు.

Telangana Cabinet: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు

ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లు తయారు చేశారని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌లో విధానపరమైన లోపాలుండడంతో, క్లబ్ పేరు మార్పును అధికారికంగా నిరాకరించినట్టు మహబూబ్‌నగర్ జిల్లా రిజిస్టర్ స్పష్టం చేశారు.

జులై 7, 2025న స్టేట్‌మెంట్ ఇచ్చిన HCA అంబుడ్స్‌మన్ న్యాయమూర్తి నర్సింహారెడ్డి ప్రకారం, గౌలిపురా క్రికెట్ క్లబ్‌ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌గా మార్చడం చట్టవిరుద్ధం. ఎఫ్ఎస్ఎల్ అందించిన రిపోర్టులో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుమార్పుకు ఉపయోగించిన సంతకాలు క్లబ్ యజమాని అసలైన సంతకాలకు సరిపోలడం లేదని తేలింది.

దీంతో సంతకాల ఫోర్జరీకి బలమైన ఆధారాలు సీఐడీకి అందాయి. జగన్మోహన్‌రావు, రాజేందర్ యాదవ్, అతని భార్య కవిత కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసినట్టు అధికారులు గుర్తించారు.

హెచ్‌సీఏ స్టోర్ ఇన్‌చార్జ్ జయరాజ్ ప్రకారం, జగన్మోహన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కొనుగోళ్లు జరగలేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. హెచ్‌సీఏ అకౌంటెంట్ మూర్తుజాఖాన్ జూన్ 19న నిధుల ఖర్చు, ఓచర్లు, చెల్లింపు వివరాలు అందజేశారు.

సీఐడీ విచారణలో హెచ్‌సీఏ నిధులు, బీసీసీఐ మంజూరైన నిధులు కూడా దుర్వినియోగం అయినట్టు తేలింది. SRHతో ఉన్న వివాదంలో ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ రిపోర్టును కూడా సీఐడీకి అందించినట్టు అదనపు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ రిమాండ్ రిపోర్టుతో హెచ్‌సీఏలో సాగిన భారీ అవకతవకలు, ఎన్నికల అవినీతి, నిధుల దుర్వినియోగం స్పష్టమవుతూ పోయాయి. క్రికెట్ మైదానంలో కొనసాగుతున్న రాజకీయ నాటకాలు తారాస్థాయికి చేరాయని ఈ వివరాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

TPCC Mahesh Goud : అలా మాట్లాడినందుకు నన్ను దేశద్రోహిగా ముద్ర వేశారు

Exit mobile version