Site icon NTV Telugu

Harish Rao : రేవంత్ హామీలు గాలిమాటలే

Harish Rao

Harish Rao

Harish Rao : రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారిందని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు ప్రకారం, గురుకులాల్లో విద్యార్థులు విషజ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి కారణాలతో ఆసుపత్రుల పాలవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.

అదేవిధంగా, గురుకులాల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆడంబర ప్రకటనలు చేసే ముందు, వారికి సకాలంలో జీతాలు చెల్లించాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన హామీలు వాస్తవంలో నీటి మూటలయ్యాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Visakhapatnam : విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం

“కల్తీ ఆహారం పెడితే జైలుకే పంపిస్తామని ఇచ్చిన ప్రకటనలు కూడా అమలు కావడంలేదు” అని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఆ సమయంలో 294 గురుకులాలను 1,024కి పెంచిన ఘనత కేసీఆర్ ది అని హరీశ్ రావు గుర్తుచేశారు. అలాగే, విద్యార్థుల సంఖ్యను 1.90 లక్షల నుంచి 6.5 లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను అందించారని చెప్పారు.

“కానీ కాంగ్రెస్ పాలనలో 22 నెలల్లోనే గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది” అని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి గురుకులాలపై చిన్న చూపు చూపడం ఆపాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, గురుకుల విద్యా వ్యవస్థకు శ్రద్ధ వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

PM Modi: జాతి ఘర్షణల తర్వాత, తొలిసారి మణిపూర్‌కు ప్రధాని మోడీ.!

Exit mobile version