కేసీఆర్ హయాంలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కొత్త సమస్యలను సృష్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఉపశమనం కంటే ఇబ్బందులే ఎక్కువయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాపాలన పేరుతో భూదోపిడీకి తెరలేపుతున్నారని, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.
ముఖ్యంగా 22-A భూముల వ్యవహారంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని అన్నారు. ప్రజల సొంత భూములు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గ్రామాలు సైతం నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. ప్రజలు తమ భూముల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచిపెడుతోందని విమర్శించారు.
భూములపై ఆంక్షల ప్రభావం సామాన్య కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని హరీష్ రావు అన్నారు. అవసరమైన సమయంలో భూమిని అమ్ముకోలేక చేతిలో డబ్బులు లేకపోవడంతో పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు కూడా ఇబ్బందుల్లో పడుతున్నాయని చెప్పారు. నల్లగొండ జిల్లాలో భూమి సమస్య కారణంగా ఓ కుటుంబంలో పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని, చివరకు గ్రామస్థులంతా కలిసి ఆ పెళ్లి జరిపించారని గుర్తుచేశారు. ఒక్క ఘటన మాత్రమే బయటకు వచ్చిందని, ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్ని కుటుంబాలు ఎదుర్కొంటున్నాయో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.
22-A భూముల అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు రెవెన్యూ శాఖే బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా మారినా బాధ్యత తీసుకోకుండా ప్రజలకు భిన్నమైన సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తూ.. రెవెన్యూ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇక హైదరాబాద్‌లో చేపడుతున్న పలు ప్రాజెక్టులు, ప్రభుత్వ భూముల వ్యవహారాలపైనా హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ భూములు, ఇతర కీలక ప్రాంతాలపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలోనూ ఇదే తరహా చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
మేడ్చల్ జిల్లాలోని భూముల వ్యవహారాన్ని కూడా హరీష్ రావు ప్రస్తావించారు. సుమారు 8 వేల ఎకరాల భూమిని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కుదవ పెట్టి మరో రూ.10 వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ఆస్తులను వినియోగించుకుని అప్పులు తెచ్చే విధానంపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములను కట్టబెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన భూములపైనా ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు.
హైడ్రా వ్యవహారంపైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దల అక్రమ నిర్మాణాలు కనిపించకుండా సామాన్యుల నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం అసలు ఏం చేయాలనుకుంటుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దల భవనాలు, ప్రభావవంతమైన వ్యక్తుల నిర్మాణాలు కనిపించవని, సామాన్యుల ఇళ్లు మాత్రం కూల్చివేతల భయంతో ఉన్నాయని ఎద్దేవా చేశారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా హరీష్ రావు తప్పుపట్టారు. మూసీ అభివృద్ధి పేరుతో వేల ఎకరాల భూమిపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. సుమారు 3 వేల ఎకరాల భూమిని వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు ఉన్నాయని విమర్శించారు. ప్రజల కోసం చేపడుతున్నామని చెబుతున్న ప్రాజెక్టుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ హరీష్ రావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 30 శాతం కమిషన్ పాలన సాగుతోందని ప్రజలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. ప్రజల ఆస్తులు, భూముల విషయంలో నిర్ణయాలు తీసుకుని వారినే ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతోందని అన్నారు.
తప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే.. వాటిని ప్రశ్నిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగుతోందని హరీష్ రావు మండిపడ్డారు. తప్పు చేసిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సింది పోయి ఎదురు ప్రశ్నలు వేయడం “ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే” అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ప్రజలకు మేలు చేసే పాలనలా కాకుండా బురద రాజకీయంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల భూములు, ఆస్తులు, భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా 22-A భూముల సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

