Harish Rao : అబద్ధాల రేవంత్ రెడ్డి.. నా గురించి మాట్లాడే హక్కు నీకుందా.?

  • రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
  • ‘నా జీవితం అంతా కేసీఆర్‌తోనే’ అంటూ స్పష్టీకరణ
  • కాంగ్రెస్ 400 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్న ఆరోపణ
  • ‘అబద్ధాల రేవంత్ రెడ్డి’గా పేరు మార్చుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు
Harish Rao Phone Tapping Case

Harish Rao Phone Tapping Case

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి తీరుపై కటువైన పదజాలంతో విరుచుకుపడ్డారు. సీఎం కుర్చీలో కూర్చుని చిల్లర మాటలు మాట్లాడటం రేవంత్‌కు తగదని హితవు పలికారు.

రాజకీయాల్లో తాను ఎల్లప్పుడూ నైతికతకు, నిజాయితీకి కట్టుబడి పని చేశానని హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ.. “నువ్వు పూటకో పార్టీ మారే వ్యక్తివి. ఇప్పటికే నాలుగు పార్టీలు మార్చి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నువ్వా నా గురించి మాట్లాడేది? గురివింద గింజ తన నలుపు ఎరగదన్నట్లుంది నీ తీరు. నా జీవితం అంతా కేసీఆర్ తోనే.. బతికి ఉన్నంత కాలం నేను బీఆర్‌ఎస్ (BRS) పార్టీలోనే ఉంటానని ఇప్పటికే వంద సార్లు చెప్పాను. అలాంటి నాపై మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది?” అని ప్రశ్నించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, లోపల ప్రధాని మోదీ, బీజేపీల పాట పాడుతున్నది రేవంత్ కాదా అని ఆయన నిలదీశారు.

×
×
Ad

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రోజుకు నాలుగు అబద్ధాలు చెబుతారని, ఎన్నికల సమయంలో 400 అబద్ధపు హామీలను ఇచ్చి అడ్డదారిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలకు అసలు విలువ ఉందా అని ప్రశ్నించిన ఆయన.. కనపడ్డ దేవుడిపై ఒట్టుపెట్టి, చివరకు రైతులకు ఇచ్చే రైతుబంధును ఎగబెట్టి మోసం చేసింది రేవంత్ రెడ్డి కాదా అని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి నిరంతరం అబద్ధాలు మాట్లాడుతుంటారని ఎద్దేవా చేస్తూ, “రేవంత్ రెడ్డి తన ఇంటి పేరును ‘ఏనుముల’ అని కాకుండా ‘అబద్ధాల రేవంత్ రెడ్డి’ అని మార్చుకుంటే బాగుంటుంది” అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా తన చిల్లర మాటలను, చిల్లర పనులను మానుకోవాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హరీష్ రావు ఘాటుగా హెచ్చరించారు.