Site icon NTV Telugu

Harish Rao : పొంగులేటి.. పొగరు తగ్గించుకో, నీ చిట్టా నా దగ్గర ఉంది..

Harish Rao

Harish Rao

తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ అక్రమాల వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ మైనింగ్ లూటీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొంగులేటి తన ‘పొగరు’ తగ్గించుకోవాలని హితవు పలికిన హరీష్ రావు, అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు.

రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు సంబంధించిన మైనింగ్ వ్యవహారాలపై మంత్రి పొంగులేటి చేస్తున్న బుకాయింపులను హరీష్ రావు ఎండగట్టారు. “అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మైనింగ్ మంత్రి స్వయంగా రాఘవ కన్స్ట్రక్షన్స్‌పై అక్రమ మైనింగ్ కేసులు పెట్టామని, పెనాల్టీలు వసూలు చేశామని చెబుతుంటే.. పక్కనే కూర్చున్న పొంగులేటి ఆరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు. 12 రోజుల తర్వాత ఇప్పుడు తనకు ఆ మైనింగ్‌తో సంబంధం లేదని చెప్పడం కేవలం తప్పును కప్పిపుచ్చుకోవడమేనని మండిపడ్డారు.

Drama Juniors : ఏప్రిల్ 12న డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఆడిషన్స్

ఈ మైనింగ్ వ్యవహారంపై రెవెన్యూ, విద్యుత్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారని హరీష్ రావు వెల్లడించారు. ఈ నాలుగు శాఖల అధికారులు కూడా అది అనుమతులు లేని ‘ఇల్లీగల్ మైన్’ అని తేల్చారని, రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు నోటీసులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన నోటీసులను పొంగులేటి ఉద్యోగులే సంతకం పెట్టి తీసుకున్న డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

“మైనింగ్ ప్రాంతంలోని కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ పేరు, కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఈ అక్రమాలను నిలదీయగానే రాత్రికి రాత్రే ఆ పేరు కనబడకుండా పెయింటింగ్ ఎందుకు వేశారు?” అని హరీష్ రావు నిలదీశారు. పొంగులేటి అబద్ధాలు చెబుతూ మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పొంగులేటిని ‘పొగరులేటి’ , ‘పొంగు లూటీ’ అని సంబోధిస్తూ, ఆయన అక్రమాల చిట్టా మొత్తం తన దగ్గర ఉందని హెచ్చరించారు.

PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!

నాదర్గుల్ భూముల విషయంలో కూడా పొంగులేటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. 2016లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టిందని, వాస్తవాలను దాచిపెట్టి చిల్లర కథలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, మంత్రి ఇప్పటికైనా బుకాయింపులు మానుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Exit mobile version