Gutha Sukender reddy: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన బీజేపీ కార్యక్రమం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏం సంబంధం, ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ప్రధాని ప్రసంగం మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడానికే పరిమితమైందన్నారు. నల్గొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పై బీజేపీ ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తోందని, ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్-విజయవాడ హైవేను మూడేళ్ల కిందటే ఆరు లేన్లుగా చేయాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. ఏహెచ్ 65 నుంచి 565 హైవేను అనుసంధానం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో నల్గొండ-మాచర్ల రైల్వే లైన్‌ను కేటాయించారని, కానీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వీటన్నింటిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మాట్లాడడం లేదని విమర్శించారు. రామభజన, ధరల పెంపు తప్ప బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
Read also: Jana Reddy: యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు
మంత్రి కేటీఆర్‌ను ప్రతిపక్షాలు టార్గెట్ చేయడం దుర్మార్గమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్లమెంట్‌లో మాట్లాడి ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేసి హైదరాబాద్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను కాపాడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రతిపక్షాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నారు. వారికి అధికార యావ తప్ప మరేమీ లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ విఫలమైందన్నారు. ఆ పార్టీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. సీబీఐ, ఈడీ కేసుల మాఫీ కోసమే ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ కేంద్ర సంస్థలను, ప్రతిపక్ష పార్టీలను, రాష్ట్రాలను అడ్డం పెట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పక్కన పెట్టడం తగదన్నారు. గవర్నర్లు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకూడదనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.
SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు