NTV Telugu Site icon

Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు

Governor Tamilisai

Governor Tamilisai

గోదావరి నదిలో ఒక్కసారిగా వరద విరుచుకుపడింది.. భద్రాచలం దగ్గర ఏకంగా 70 అడుగులను దాటేసింది.. ఇక, కడియం ప్రాజెక్టు ఉంటుందా..? ఊడిపోతుందా? అనే టెన్షన్‌ కూడా పెట్టింది.. అయితే, ఈ నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. భారీ వర్షాలు, వరదలపై స్పందిస్తూ.. దీని వెనుక విదేశాల కుట్ర ఏమైనా ఉందోమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు.. ఇప్పటికే లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్‌ చేశారని.. ఇప్పుడు గోదావరి ప్రాంతంలోనూ అదే జరిగి ఉంటుందేమో.. దీనిపై ఇంకా సమాచారం రావాల్సి ఉందన్నారు.. అయితే, యానాం పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌.. క్లౌడ్‌ బరస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్‌ బరస్ట్‌ కాదని తేల్చేసిన ఆమె.. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు.

Read Also: Minister Harish Rao: మోదీజీ.. పేదలు ఏం పాపం చేశారు?

యానాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన తమిళిసై… 15వ తేదీన వరదలపై రివ్యూ నిర్వహించాం.. అనుకోకుండా వరదలు ముందుగానే వచ్చాయని తెలిపారు.. ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము… 25 కేజీల బియ్యం ప్రభుత్వం ఇస్తుంది.. ప్రతి బాధితుడిని అన్ని విధాలా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆదుకుంటున్నాం.. వైద్యం విషయంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. ఇక, ఆంధ్ర ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా యానాం రక్షణ వాల్ నిర్మాణం కోసం డిజైన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. రక్షణ వాల్ నిర్మాణానికి 137 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ ప్రకటించిందని తెలిపారు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ వ్యాఖ్యలపై ఆమె స్పందించడం.. ఆయనకు కౌంటర్‌ ఇచ్చినట్టు అయ్యింది.

ఇక, ఈ వ్యవహారంలో సమాచారం ఉంటే ఇవ్వండి.. ఎలాంటి విచారణ జరిపించడానికైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.. క్లౌడ్‌ బరస్ట్‌పై అంతర్జాతీయ కుట్ర సమాచారం ఉంటే ఇవ్వండన్న ఆయన.. ఇప్పటి వరకు ఒక దేశంలో మరో దేశం క్లౌడ్‌ బరస్ట్‌ చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.. లద్దాఖ్, ఉత్తరాఖండ్‌లో అలా జరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు, దానికి సంబంధించిన సమాచారం ఉంటే ఇవ్వాలి, ఏ దేశాలు, సంస్థలు కుట్రలు చేశాయో పూర్తి స్థాయిలో విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.