Aashadam Bonalu 2025 : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు నేడు (గురువారం) నుండి ఘనంగా ప్రారంభంకానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనం తో ఈ ఉత్సవాలకు తెరలేచింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొని బోనాలకు అధికారికంగా ప్రారంభం పలుకనున్నారు.
Virgin Boys: నేను పూర్తిగా నటిగా తృప్తి చెందా..మిత్రా శర్మ కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం పోతరాజులు, నృత్య బృందాలతో పాటు తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ కోటకు ఉత్సాహభరితమైన ర్యాలీ నిర్వహిస్తారు. గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలను ఆభరణాలతో అలంకరించిన తరువాత, గోల్కొండ కోటపై ఉన్న ఆలయం వరకు ఊరేగింపు కొనసాగుతుంది. అక్కడ తొట్టెల సమర్పణతో మొదటి బోనం పూజ ముగుస్తుంది. ఇక బోనాల ప్రారంభానికి ముందురోజు అమావాస్యను పురస్కరించుకొని బుధవారం మహిళలు గోల్కొండ కోట మెట్ల వద్ద బొట్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు ముందురోజు మెట్ల పూజ నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.