Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..

  • మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా కీలక పనులు
  • ఘన్‌పూర్, హిమాయత్‌సాగర్ వద్ద భారీ నీటి శుద్ధి కేంద్రాలు
  • కోకాపేట్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు పైప్‌లైన్ నిర్మాణం
  • పదేళ్ల పాటు ప్రాజెక్టు నిర్వహణకు ప్రభుత్వ అనుమతులు
Musi

Musi

భాగ్యనగరానికి తాగునీటిని, అందాన్ని అందించిన చారిత్రక ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు త్వరలోనే సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూసీ పునరుజ్జీవన’ (Musi Rejuvenation) ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలతో ఈ జంట జలాశయాలను నింపేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేసింది.

భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు.. గ్రావిటీ పైప్‌లైన్లు

ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని శుద్ధి చేసి జలాశయాలకు మళ్లించేందుకు అధునాతన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (WTP) నిర్మించనున్నారు. ఘన్‌పూర్‌లో 120 ఎంఎల్డీ (MLD), అలాగే హిమాయత్‌సాగర్ వద్ద 70 ఎంఎల్డీ సామర్థ్యంతో భారీ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు కోకాపేట్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు, ఉస్మాన్‌సాగర్ నుంచి హిమాయత్‌సాగర్‌ను అనుసంధానిస్తూ భారీ పైప్‌లైన్లను నిర్మించనున్నారు. ఇక హిమాయత్‌సాగర్ నుంచి బుద్వేల్ రిజర్వాయర్‌కు నీటిని సజావుగా తరలించేందుకు కూడా ప్రత్యేక పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు.

హైబ్రిడ్ మోడల్‌లో ప్రాజెక్టు.. పదేళ్ల పాటు ఆమోదం

ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (HAM) విధానంలో పనులను అమలు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు పనుల నియామక తేదీగా (Appointed Date) 2026 జూన్ 24ను నిర్ణయించిన ప్రభుత్వం, ప్రాజెక్టు నిర్వహణ , మౌలిక వసతులకు పదేళ్ల పాటు అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిరంతరం జలకళతో విలసిల్లడమే కాకుండా, మూసీ నదికి మళ్లీ పూర్వవైభవం రావడం ఖాయంగా కనిపిస్తోంది.