Godavari Water Level Receding At Bhadrachalam: గత రెండు రోజుల నుంచి ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం భద్రాచలం వద్ద నిలకడగా సాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరద వల్ల గోదావరి నీటిమట్టం 51.8 అడుగుల వద్ద ఉంది. రాత్రి 7 గంటల నుంచి ఈ ఉదయం 6 గంటల వరకు 51.8 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. తాజా అంచనా ప్రకారం.. ఈ సాయంత్రానికి గోదావరి భారీగా తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో వర్షం లేకపోవడంతో గోదావరి వరద పూర్తిస్థాయిలో తగ్గుతుందని చెప్తున్నారు. దీంతో.. పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్టులలో గోదావరి తగ్గుముఖం పడుతోంది. 11 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకి ధవలేశ్వరం వైపు గోదావరి వరద వెళుతుంది.
వారం రోజుల నుంచి కుండపోతగా వర్షాలు కురవడంతో.. ఇంద్రావతి, ప్రాణహిత నుంచి భారీగా వరద వచ్చింది. దాంతో.. ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి, పది లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకి నీరుని విడుదల చేశారు. అటు.. తుపాకుల గూడెం ప్రాజెక్టులో స్థాయికి మించి నీటి ప్రభావం రావడంతో నీటిని విడుదల చేయడం జరిగింది. కాళేశ్వరం, మేడిగడ్డ, ఏటూరు నాగారం, పేరూరులో వరద స్థాయి తీవ్రత తగ్గింది. పేరూరు, ఏటూరు, నాగారం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగి తగ్గటం ప్రారంభమైంది. ఎగువన ఉన్న దుమ్ముగూడెంలో కూడా వరద తగ్గిపోవడం ప్రారంభమైంది.