Gangula Kamalar Reveals CM KCR Ambition: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి, ఆ సంపదను పేద ప్రజలకు పంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని గొప్ప పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో.. కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి మండలాలకు చెందిన 142 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 1,42,16,472 లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదింటి అమ్మాయిల వివాహాలకు అండగా నిలవాలనే ఆలోచన రావడమే చాలా గొప్పదని.. అన్నగా, మేనమామగా పేద ఆడబిడ్డలకు అండగా ఉండేందుకే ఈ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. పెళ్లయిన నెల రోజుల్లోనే చెక్కులు అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే.. మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లోని ప్రతి పేద విద్యార్థికి సంవత్సరానికి రూ. 1.25 లక్షలు వెచ్చింది, నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
అంతకుముందు రోజు.. కరీంనగర్‌లోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గంగులా కమలాకర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అవసరాలను, వారి ప్రాధాన్యతలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తున్నారు కాబట్టే.. రాష్ట్రంలో ధాన్యం సాగు గణనీయంగా పెరిగిందని చెప్పారు. యావత్ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆహార ధాన్యాలు అందిస్తోందన్నారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణకు కేంద్రం అనేక కొర్రీలు పెట్టినా.. ప్రతీ గింజను తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందని వెల్లడించారు. 2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరగ్గా.. ఇప్పుడు కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించగా.. ఇప్పటిదాకా 1545 కేంద్రాలు ప్రారంభించారని, దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని మంత్రి గంగులా కమలాకర్ స్పష్టం చేశారు.