వినాయక చవితి వచ్చిందంటే యువకుల్లో సంబరాలు అంబరాన్నంటుతాయి. లంబోదరుని ప్రతిమలు పెట్టి నవరాత్రులు సంబురాలు చేయటం ఆనవాయితీ. వినాయక సంబురాలంటే యువతతో పాటు చిన్నారుల్లో తెలియని ఉత్సాహం, వీధివీధినా మండపాలు వేసి, పెద్దపెద్ద గణనాథుని విగ్రహాలు పెట్టి కోలాహలంగా వేడుక చేస్తారు. గణపతి పండుగలో సంబురాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో.. ప్రతిమలకు అంతే ప్రాధాన్యం ఉంటుంది. వినాయక విగ్రహాన్ని స్వయంగా తయారు చేయటమో.. లేదా తయారు చేసిన ప్రతిమనే కొనుక్కొచ్చుకొని ప్రతిష్ఠించి పూజలు చేయటమో లేదా.. పర్యావరణహితులెవరైనా మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తే తెచ్చుకుని పూజిస్తారు. పండుగకు పెట్టే ప్రతిమలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్. అంతేకాదు గత రెండేళ్లు కరోనా కారణంగా మార్కెట్ కొంత నిరాశపర్చగా ఈసారి ఎలాంటి విఘ్నాలు లేకపోవటంతో విఘ్నేశ్వరునికి అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. ఇక విగ్రహాల ధరలు గట్టిగా పలుకుతున్నాయి. దీంతో.. ఎవరి తాహతకు తగ్గట్టుగా వాళ్లు గణేషుని ప్రతిమలను కొనుక్కుని తీసుకెళ్తున్నారు.
ఈ సందర్భంగా.. ఓ ముగ్గురు యువకులు చేసిన పని మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వినాయకుడి విగ్రహాలకి ధరలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. గానీ.. దానికి తగ్గట్టుగా చందాలు వసూలు చేయటమో..? దాతలను ఒప్పించటమో..? చేసి ప్రతిమను కొనుక్కెళ్లాలి. లేకపోతే వాళ్ల దగ్గరున్న బడ్జెట్కు సరిపోయే విగ్రహాన్ని కొనుక్కెళ్లాలి. కానీ కొందరు యువకులు చేసిన పనిమాత్రం అందుకు భిన్నంగా రాజా సినిమాలో వెంకటేశ్ ను ఫాలో అయ్యారు. సోమవారం అర్థరాత్రి లంబోదరున్నే ఏకంగా కొట్టేశారు. హైదరాబాద్ లోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర భవన్ హోటల్ వద్ద ఈఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో ముగ్గురు యువకులు వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్దకు వచ్చారు. తాము తెచ్చిన ఆటోను రోడ్డుకు అవతలివైపునే పెట్టారు. ఎవరూలేకపోవటం చూసి.. షెడ్డులో నుంచి వినాయకుడి విగ్రహాన్ని గుట్టుగా బయటకు తీసుకొచ్చారు. గణపతి ప్రతిమ బరువుగా ఉండటంతో, హోటల్ వద్ద రోడ్డుపై పెట్టారు. వాహనాలు రాని సమయంలో వినాయకున్ని వేగంగా రోడ్డు దాటించారు. అయితే..రోడ్డు అవతల ఉన్న ఆటో ఎక్కించుకుని వెళ్లిన తతంగమంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు ఆ యువకులు ఎవరూ..? ఎందుకు ఇలా చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
WATCH: #ganpati idol stolen in #Hyderabad.
Three youths drove away with the idol of the Lord Ganesh that was kept for sale at a roadside stall. #GanpatiBappaMorya pic.twitter.com/Ylm1FQ5ADd
— Ashish (@KP_Aashish) August 31, 2022