Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం

  • అమరావతి బస్సులో దంపతుల బ్యాగ్‌కు కన్నం
  • లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు చోరీ
  • బుకింగ్ ఐడీలతో నిందితుల కోసం పోలీసుల గాలింపు
  • గచ్చిబౌలి ఘటనపై కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
Roberry

Roberry

Robbery : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో ఒక బస్సులో భారీ దోపిడీ జరిగింది. ఆర్టీసీ అమరావతి బస్సులో ప్రయాణిస్తున్న ఒక దంపతుల బ్యాగ్‌ను టార్గెట్ చేసిన దుండగులు, అందులోని రూ.లక్షల విలువైన బంగారం , వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. కొండాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ సి. శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ నుండి గుంటూరులోని SVN కాలనీకి అమరావతి బస్సు (AP 4219) లో బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా వారు తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో ఒక ప్లాస్టిక్ డబ్బాను ఉంచారు. అందులో ఒక అన్‌కట్ డైమండ్ నెక్లెస్, ఒక బంగారు గాజు , ఒక బంగారు కమ్మ ఉన్నాయి. ప్రయాణికుల కన్నుగప్పి చాకచక్యంగా బ్యాగ్ జిప్ తీసిన దొంగల ముఠా, లోపలి నగలను కొట్టేసి బ్యాగ్‌ను ఏమీ తెలియనట్లు యథావిధిగా పక్కన పెట్టేశారు.

బుకింగ్ ఐడీ ఆధారంగా పోలీసుల గాలింపు

గమ్యస్థానానికి చేరుకున్నాక నగలు మాయమైనట్లు గుర్తించిన శ్రీధర్ బాబు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వెనుక సీట్లలో ప్రయాణించిన వాజిద్ (42), జబీద్ (28) అనే వ్యక్తులపై బాధితుడు అనుమానం వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల బుకింగ్ ఐడీల ఆధారంగా వారి లైవ్ లొకేషన్‌ను ట్రైస్ చేస్తూ గాలింపు చర్యలు వేగవంతం చేశారు.