Asaduddin Owaisi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మరోసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఇతరులపై వేళ్లు చూపించే ముందు తనను తాను అద్దంలో చూసుకోవాలని శనివారం అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు.
రాహుల్ గాంధీ అధ్యక్షతన 2019లో కాంగ్రెస్ 540 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. 50 స్థానాలకు పడిపోయిందని అన్నారు. దీనికి ప్రధాని మోడీ నుంచి రాహుల్ గాంధీ ఎంత డబ్బు తీసుకున్నారు..? ముందు తనను తాను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. ఇతరుల వైపు వేళ్లు చూపే ముందు మొదట అద్దంలో తనను తాను చూసుకోవాలని అన్నారు.
బాబ్రీ మసీద్ కూల్చివేతలో హస్త ఉన్న శివసేనతో పొత్తు పెట్టుకున్నారని రాహుల్ గాంధీని విమర్శించారు. ఎంఐఎం మైనారిటీలు, పేదల గొంతుకగా ఆవిర్భవించిందని కాంగ్రెస్ ఆందోళన చెందుతుందని అన్నారు. వారితో పోరాడుతూనే ఉంటామని ఓవైసీ చెప్పారు. కాంగ్రెస్ మానిఫెస్టో కేవలం కాగితంపై సిరా మాత్రమే అని ఎద్దేవా చేశారు. వారి మానిఫెస్టోలో ఏం లేదని అన్నారు.
Read Also: Domestic Violence: అత్తగారి ఇంట్లో ఉన్నది 11 రోజులే.. వరకట్న వేధింపుల కేసు..కోర్టు ఏం చెప్పిందంటే..
ముస్లిమేతరులకు చాలా ప్రయోజనాలు ప్రకటించారని, ముస్లిం మహిళలకు ఏం లేదని ఇది వారి నిజస్వరూపమని అన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మైనారిటీ డిక్లరేషన్ ఎందుకు ప్రకటించలేదని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు. ఇక్కడ ఎంఐఎం ఉందనే వారు భయపడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ‘మొహబ్బత్ కి దుకాన్’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వారిది ప్రేమ కాదని ద్వేషమని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ చీఫ్ ఆర్ఎస్ఎస్‌కి చెందిన వాడు, మా బట్టలు, టోపీలపై వేలెత్తి చూపిస్తున్నప్పుడు, వారికి ప్రేమ గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరగబోతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.