మంత్రి మల్లారెడ్డి అలాగే.. ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ భూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు రాగా.. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డికి చిక్కుల్లో పడినట్టు అయ్యింది.. ఎందుకంటే.. మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త అయిన ముద్దుల శ్రీనివాసరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నాడు.
భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మార్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త మద్దుల శ్రీనివా్‌సరెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సర్వేనంబర్ 5, 6లలో భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడుల మధ్య కొన్నిరోజులుగా భూ వివాదం నడుస్తోంది.
కాగా, మూడు రోజులక్రితం.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలం చుట్టూ ఉన్న కడీలను పడగొట్టి, అక్కడున్న సెక్యురిటీ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. స్థలం వద్ద నానా హంగామా సృష్టించి తీవ్ర భయాందోళన కలిగించారు. దీంతో వేణునాయుడు ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేసి, 10 మందిని బుధవారం రిమాండ్ తరలించామని సీఐ రమేష్ తెలిపారు. కాగా, మరో ఐదుగురు.. మల్లారెడ్డి, మద్దుల శ్రీనివా్‌సరెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, నరసింహారెడ్డి, బశ్చేందర్ సింగ్ పరారీలో ఉన్నారని తెలిపారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తామని సీఐ పేర్కొన్నారు.
డిసెంబర్ 9 2020లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైన విషయం తెలిసిందే. కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో తన భూమి కబ్జా చేశారని శ్యామలదేవి అనే మహిళ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరులు తనకున్న రెండు ఎకరాల 13 గుంటల భూమిలో 20 గుంటలు కబ్జా చేసి ప్రహరీగోడ నిర్మించారని ఆరోపించారు. మంత్రి ఆదీనంలో ఉన్న భూమిని విడిపించాలంటూ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతో మంత్రి మల్లారెడ్డి కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తెలిపింది. శ్యామల ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డి, ఆయన కొడుకుతోపాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Municipal Corporation : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ఒకటే మునిసిపల్ కార్పొరేషన్..