నిన్న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చెప్పాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఆర్మీ అభ్యర్థి మహేందర్ మేనమామ మాట్లాడుతూ.. 5ఏళ్ల నుంచి మహేందర్ ఆర్మీలో జాబ్ కొట్టాలని తీవ్ర కృషి చేస్తున్నాడని, నిన్న ఆర్మీ ఆఫీస్ కి వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని సికింద్రాబాద్ కి వెళ్ళాడన్నారు.
ఇక్కడ నిన్న ఏం జరిగిందో ఎవరు ఇలా చేశారో తెలియదని, నిన్నటి నుండి మహేందర్ ఎక్కడున్నాడో ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో తెలియదని ఆయన వెల్లడించారు. నిన్న 100కి కాల్ చేసి అడిగితే గోపాలపురం పీఎస్ కి వెళ్లి అడగమని చెప్పారని, ఉదయం అక్కడికి వెళ్లి అడిగిన కూడా పోలీసులు చెప్పటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల కోసం వస్తున్నారని, పోలీసులు ఎలాంటి సమాచారం మాకు ఇవ్వటం లేదని ఆయన తెలిపారు.