“కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా
ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న
నీ కష్టం అంటా తీరునురో రన్నో చిన్నన్న”
1955 ఏప్రిల్ 14న రిలీజ్ అయిన “రోజులు మారాయి” ఈ సినిమాలోని ఈ పాట అప్పట్లో మారుమ్రోగింది. ఈ పాటను గాన కోకిల జిక్కి పాడారు. ఆపాటలో బాలివుడ్ హీరోయిన్ వహిదారహమాన్ డాన్స్ ఆడుతూ ఈ సాంగ్ పూడుతుంటే.. అక్కినేని నాగేశ్వరావు సద్దిఅన్నం మూట గట్టుకుని, ఎద్దులను తీసుకుని పోయే సీన్ అది. అలాంటి శుభవేలే ఏరువాక.
తొలకరి పిలుపు రైతన్న మోములో చిరునవ్వు, పిల్ల కాలువల గెంతులాట, పుడమితల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే ప్రారంభమవుతుంది.
అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే వేడుక. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఏరువాక పౌర్ణమి రోజు రైతులు పొద్దున్నే నిదుర లేచి ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు పసుపు, కుంకుమ కొంతమంది అయితే రంగులు కూడా పూస్తారు, అలాగే వాటికి చక్కగా గజ్జెలు, గంటలు కట్టి వాటిని కట్టేసే తాడుని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు.ఇక ఎద్దులకు కూడా భక్తి శ్రద్ధలతో బొట్టు పెట్టి పూజలు చేసి వాటికి బొబ్బట్లు తినిపిస్తారు.
అలాగే పొలాలకు వెళ్ళి భూదేవికి పూజలు చేసి పంటలు బాగా పండేలా దీవించమని ప్రార్థిస్తారు, ఎద్దులకు రంగులద్ది రకరకాల బట్టలతో అలంకరిస్తారు. మేళ తాళాలు డప్పు వాయిద్యాల నడుమ వాటిని ఊరంతా ఊరేగిస్తారు, అంటే ఓ చిన్న సైజు హోళి పండుగే కనిపిస్తుంది.
అలాగే ఎద్దులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, రోగాల బారిన పడకుండా ఉండేందుకు అధర్వణ వేదం లో చెప్పబడిన మందులను , నూనెలను తాగిస్తారు. అలాగే నాగలి తో పాటు అన్ని వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లకు పసుపు కుంకుమ రాసి పొంగళి నైవేద్యం సమర్పిస్తారు.
ఇంకో వైపు సస్యానికి ఓషధులకు అధిపతి చంద్రుడు. వర్ష ఋతువు మొదలయ్యక జ్యేష్టా నక్షత్రం లో తన నిండైన రూపంతో చందమామ కూడేది పౌర్ణమి రోజే, దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కరువు కాటకాలు లేకుండా వర్షాలు సమృద్ధిగా పాడి పంటలు చక్కగా పండాలి, దానికి నాంది పడేదే ఏరువాక పౌర్ణమి రోజు. రైతే రాజు అని కీర్తించే మన దేశం లో రైతు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం.