వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు పాలకుర్తి నియోజకవర్గములో సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్లు తదితర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కిరికిరి చేష్టలు, బోగస్ మాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని పాలించిందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ చేసింది ఏమీ లేదని, అబద్ధాలు చెప్పి అధికారంలో ఉంటోందని ఆయన మండిపడ్డారు. ఈ రెండు పార్టీలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
కుంట్లో రాయి తీయనోడు, ఏట్లే రాయి తీస్తాడా? అంటూ ఎద్దేవా చేసిన మంత్రి ఎర్రబెల్లి.. వాళ్లు పాలించే రాష్ట్రాల్లో అభివృద్ధి చేయడం చేతగాదు కానీ, తెలంగాణలో ఏదో చేస్తామని బొంకుతున్నారన్నారు. ఇక్కడ మాటలు చెప్పుడు కాదు. ముందుగా మీరు పాలించే రాష్ట్రాల్లో ఏదైనా చేసి చూపండని, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీరు ఏది చెబితే అది నమ్మడానికి అంటూ ఆయన ధ్వజమెత్తారు.