CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

  • ఎల్ నినో ప్రభావంపై సీఎం హెచ్చరిక
  • తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి
  • 20,003 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
  • విపత్తును ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక
Cm Revanth

Cm Revanth

గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు ముంచుకొస్తున్నాయని, ఇందులో భాగంగా ఎదురవుతున్న ‘ఎల్ నినో’ ప్రభావం పట్ల తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎల్ నినో ప్రభావం దాదాపు 100 దేశాలపై ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించిందని, దీనివల్ల ఎండల తీవ్రత పెరిగి నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అలర్ట్ చేశారని తెలిపారు. 2019–20లో ప్రపంచం కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ఇప్పుడు భూమిపై ఉన్న ప్రతి జీవరాశిపై ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ఇప్పటికే అధికారులతో సమీక్షించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

రైతులు నీటి వినియోగంపై దృష్టి పెట్టాలి

ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు మొదటి దెబ్బ తినేది రైతులేనని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో వరి సాగు ఎక్కువ కావడం, దానికి నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ, వర్షాధారిత పంటలను వేయాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల మార్పిడిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. ఎంత ధరికైనా కొనుగోలు

ఎండల తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో తెలంగాణ వచ్చిన కొత్తలో 6 నుంచి 7 వేల మెగావాట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 13 నుంచి 14 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్.. ఇప్పుడు ఏకంగా 20 వేల మెగావాట్లకు దాటిందని వివరించారు. ఈ రోజు రాష్ట్రంలో 20,003 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైనప్పటికీ, నిరంతర సరఫరా అందిస్తున్న విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలో రైతుల చేతికి వచ్చిన పంట ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఎంత ధర పెట్టైనా సరే విద్యుత్‌ను కొనుగోలు చేసి సప్లై చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తును ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.