Site icon NTV Telugu

NTV జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ( EGI ) ఆందోళన

Revanth

Revanth

తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అత్యున్నత మీడియా సంస్థ అయిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (EGI) ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే అభియోగాలతో ఎన్టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులను అర్ధరాత్రి వేళ హడావుడిగా అరెస్టు చేసిన విధానాన్ని గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టుల విషయంలో పోలీసులు తీవ్రమైన అత్యుత్సాహం ప్రదర్శించారని, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు వారిని లాకప్‌లో ఉంచడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.

 
PM Modi: ‘‘మహా జంగిల్ రాజ్’’.. మమతా బెనర్జీ పాలనపై ప్రధాని మోడీ ఫైర్..
 

ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారి బదిలీకి సంబంధించిన వార్త ప్రచురించినందుకు జర్నలిస్టులపై ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడటం మీడియా స్వేచ్ఛను అణచివేయడమేనని గిల్డ్ తన లేఖలో ఘాటుగా విమర్శించింది. ఈ అరెస్టులకు ముందు పోలీసులు కనీస న్యాయ ప్రక్రియను పాటించలేదని, సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సిందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. ఇలాంటి అధికార దుర్వినియోగం వల్ల స్వతంత్రంగా పనిచేసే మీడియా సంస్థల్లో భయాందోళనలు నెలకొంటాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించింది.

తెలంగాణలో మీడియా ప్రతినిధులు ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా తమ బాధ్యతలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రికి గుర్తు చేసింది. భవిష్యత్తులో అధికారులు జర్నలిస్టులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని, చట్టబద్ధమైన నిబంధనలను కచ్చితంగా అనుసరించేలా ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని గిల్డ్ తన లేఖలో డిమాండ్ చేసింది. మీడియా స్వేచ్ఛను కాపాడటం ద్వారానే పారదర్శకమైన పాలన సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎడిటర్స్ గిల్డ్ నొక్కి చెప్పింది.

 
Temple Bell: గుడిలో గంట కొట్టేది దేవుడి కోసం కాదా?

Exit mobile version