SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!

  • తెలంగాణలో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల
  • ఇంటింటికీ వెళ్లనున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు
  • జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ
  • అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల
Siir Phase 3

Siir Phase 3

దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితాల సమగ్ర సవరణ, నవీకరణే (Update) లక్ష్యంగా ప్రతిష్టాత్మక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) – ఫేజ్ 3 కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ డ్రైవ్‌ను దశలవారీగా నిర్వహించనున్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, డూప్లికేట్ , మరణించిన వారి ఓట్లను తొలగించడమే ఈ #SIR2026 ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.

ఈ ఫేజ్-3 డ్రైవ్‌లో తెలంగాణ , పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ సవరణ ప్రక్రియకు అక్టోబర్ 1, 2026 నాటికి అర్హత సాధించే వారిని ప్రామాణికంగా (Qualifying Date) నిర్ణయించారు. తెలంగాణలో జూన్ 15 నుండి జూన్ 24 వరకు ఓటరు జాబితా సవరణకు సంబంధించి ప్రాథమిక సన్నాహాలు, అధికారులకు శిక్షణ (Training) , అవసరమైన ఫారాల ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) ప్రతి ఇంటికి స్వయంగా పర్యటించి (House-to-House Visit) అర్హులైన ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఇదే సమయంలో జూలై 24 లోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Rationalization) ప్రక్రియను కూడా అధికారులు పూర్తి చేస్తారు.

ఈ ఇంటెన్సివ్ డ్రైవ్ ముగిసిన తర్వాత, సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ‘డ్రాఫ్ట్ ఓటరు జాబితా’ (కరడు ఓటరు జాబితా) ను పబ్లిష్ చేస్తారు. ఈ డ్రాఫ్ట్ లిస్ట్‌పై ఓటర్లు తమ అభ్యంతరాలు, క్లెయిమ్స్ (Claims & Objections) దాఖలు చేసుకోవడానికి జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అంటే నెల రోజుల పాటు సమయం ఇస్తారు. అభ్యంతరాలు , క్లెయిమ్స్ అన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తారు. చివరగా అన్ని రకాల సవరణలు పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 1న తెలంగాణ అధికారిక ‘తుది ఓటరు జాబితా’ను (Final Electoral Roll) విడుదల చేస్తారు.

ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పొలిటికల్ పార్టీలు కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద తమ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను (BLAs) నియమించుకోవాలని ఈసీఐ సూచించింది. అర్హత కలిగి ఉండి ఇప్పటివరకు ఓటు హక్కు లేని ప్రతి పౌరుడూ ఓటరుగా నమోదయ్యేలా చూసేందుకు ప్రజలందరూ ఈ డ్రైవ్‌లో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.