Drugs Kingpin John Stephen Dsouza Arrested By Hyderabad Police: గోవా డ్రగ్స్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డీసౌజాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో హిల్‌టాప్ నైట్ క్లబ్ నిర్వహిస్తున్న జాన్.. గోవా కేంద్రంగా వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే అతడ్ని అరెస్ట్ చేసేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆరుగురు సభ్యులతో కలిసి హెచ్‌న్యూ – ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఐదు రోజుల క్రితం గోవాల్ చిక్కిన డ్రగ్స్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం మేరకు.. జాన్ డీసౌజాను పట్టుకునేందుకు ఈ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ఎట్టకేలకు అతడ్ని గోవాలో అదుపులోకి తీసుకోవడంతో, ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గోవా కోర్టులో హాజరు పరిచిన అనంతరం.. ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. గోవా పోలీసులకు సైతం మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈ డ్రగ్స్ కింగ్‌పిన్.. సోనాలీ ఫొగట్ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
కాగా.. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, బెంగుళూరు, చెన్నైకి కూడా స్టీఫెన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నార్కొటిక్స్ వింగ్ ఇదివరకే తెలిపింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని.. వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తూ వచ్చాడు. తొలుత డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిని అరెస్ట్ చేసి, అక్కడి నుంచి మెల్లగా కూపీ లాగారు. విచారణలో భాగంగా.. కాలేజీలు, స్కూల్స్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు అధికారులకు తెలిసింది. దీంతో.. వెంటనే రంగంలోకి దిగి, డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారో గుర్తించి, కొందరిని అరెస్ట్ చేశారు. టోనీ అనే నిందితుడు సైతం ముంబై నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని తెలిసి.. అతడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఇప్పుడు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా తాజాగా డ్రగ్స్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డీసౌజాను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇతడ్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు.