తరచూ రోడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కొన్ని ఘటనలు మినహాయిస్తే.. ఎక్కువ ప్రమాదాలు తాగి వాహనాలు నడపడమే కారణంగా తేలుతోంది.. మద్యం సేవించి.. వాహనాలతో రోడ్లపైకి వచ్చి.. మెరుపు వేగంతో దూసుకెళ్తూ.. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు. అయితే, వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. ఇప్పటి వరకు రాత్రి సమయంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తూ.. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తూ, వాహనాలు సీజ్ చేస్తూ వస్తున్న పోలీసులు.. ఇక, ఓ సమయమంటూ లేకుండా ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనూ పబ్బులు, బార్లలలో చిత్తుగా తాగేసి… వాహనాలు నడుపుతున్నవారిపై ఫోకస్ పెట్టారు.. ఈ మధ్య జరిగిన కొన్ని ప్రమాదాలను పరిశీలించిన తర్వాత రాత్రివేళతో పాటు తెల్లవారుజామున, మధ్యాహ్నం సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు.. దీంతో, ఇకపై పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.
Read Also: మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఘట్టమనేని ఫ్యామిలీ విన్నపం
అయితే, ఈ పగటిపూట చేపట్టనున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా కాకుండా మొదట కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయనున్నారు.. మొదటగా.. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, అంబర్‌పేట, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, లిబర్టీల్లో పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు పోలీసులు. అంటే ఒక్కోరోజు ఒక్కో రూట్‌లో ఈ తనిఖీలు జరగనున్నాయి.. ఇక, తాగి పట్టుబడితే.. మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.. ఇప్పటికే జైలు, జరిమానాలు విధిస్తుండగా.. ఇప్పుడు మందు బాబుల భవిష్యత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.. పాస్‌పోర్టు, వీసాలు, ఉద్యోగాలపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎఫెక్ట్ పడనుంది.. ఎందుకంటే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి జైలుకు వెల్తే భవిష్యత్తులో వారికి పాస్‌పోర్టు, వీసా, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే సందర్భాల్లో అడ్డంకులు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు..