వారిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. కలిసి సాగాల్సిన చోట కత్తులు దూసుకుంటున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఎత్తులు వేస్తున్నారు. పోలీసుల ఎంట్రీ వారి మధ్య ఇంకా గ్యాప్ తెచ్చిందట. ఎవరా నాయకులు? ఏమా కథ?
వేడెక్కిస్తున్న నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ రాజకీయం
నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా.. సందర్భం వస్తే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇదే అక్కడి టీఆర్‌ఎస్ రాజకీయాన్ని ఎప్పటికప్పుడు వేడెక్కిస్తోంది.
పోలీసులపై తీవ్రస్థాయిలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఫైర్
ముఖ్యంగా తన అనుచరులకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వకుండా.. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డిపై ఎమ్మెల్సీ గుర్రుగా ఉన్నారట. ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్వపక్షంలో విపక్షం మాదిరి పోలీసులను, వారి వ్యవహార శైలిని దామోదర్‌రెడ్డి ఎండగట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై ఉన్న తీవ్ర అసంతృప్తిని రూటుమార్చి పోలీసులపై వెళ్లగక్కారనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది.
అసెంబ్లీ, స్థానిక ఎన్నికల వరకు కలిసే ఉన్నారు
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ.. గులాబీ గూటిలో చేరారు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి. నాగం జనార్దన్‌రెడ్డికి సుదీర్ఘ కాలం రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారాయన. టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలోనే మరో పర్యాయం ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ లభించిందని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య సఖ్యత కనిపించింది. అది స్థానిక ఎన్నికల వరకు కొనసాగింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు వారిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చాయట.
ప్రభుత్వ విప్‌గా ఉంటూ పోలీసులపై విమర్శలు చేయడంతో కలకలం
దామోదర్‌రెడ్డి వర్గంగా ముద్రపడ్డ కొందరు సర్పంచ్‌లపై ఇటీవల కేసులు నమోదయ్యాయి. వాటి వెనక ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ఉన్నారని ఎమ్మెల్సీ వర్గం ఆరోపిస్తోంది. ఇదంతా కక్ష సాధింపు ధోరణితో చేస్తున్నారని దామోదర్‌రెడ్డి మండిపడుతున్నారట. అయితే తన అసంతృప్తిని ఎమ్మెల్యేపై వ్యక్తం చేయకుండా పోలీసులపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ. దామోదర్‌రెడ్డి కేవలం ఎమ్మెల్సీ మాత్రమే కాదు. మండలిలో విప్‌గానూ ఉన్నారు. అలాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి.. పోలీస్ స్టేషన్లా.. కలెక్షన్ సెంటర్లా అని పలు అంశాలను ప్రస్తావించడం కలకలం రేపింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఎమ్మెల్యే వర్గం డుమ్మా
దామోదర్‌రెడ్డి పార్టీ మారిపోతారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం వెనక పోలీసులే ఉన్నారని ఎమ్మెల్సీ వర్గం అనుమానిస్తోందట. ప్రజల మన్ననలు పొందుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే పోలీసులు అలా చేస్తున్నారని దామోదర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు మళ్లీ బయటపడ్డాయి. కార్యక్రమాలకు దామోదర్ రెడ్డి ముఖ్యఅతిధిగా హజరై జెండా ఆవిష్కరణ చేయగా.. ఎమ్మెల్యేతోపాటు, ఆయన అనుచరులుగా పేరున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం హాజరు కాలేదు. దీనిపై కూచుకుళ్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కావాలనే క్యాడర్‌ను రాకుండా చేశారని దామోదర్ రెడ్డి వర్గం అభిప్రాయ పడుతోంది. దీంతో నాగర్‌కర్నూలు టీఆర్‌ఎస్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.