సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి. జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ బుక్ ను ఆవిష్కరించారు మహేందర్ రెడ్డి. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై, ఐటీ ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ పై జిల్లాలఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెరిగిపోతున్న సాంకేతికతకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నదని ఆయన అన్నారు. ఇందుకోసమే పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి ప్రతీ పోలీస్ స్టేషన్ లో ఒకరిని సైబర్ వారియర్ గా నియమించడం జరిగిందని గుర్తు చేశారు. సైబర్ నేరాలను నియంత్రించడంతో ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించాలని.. అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం భాగంగా రూపొందించిన సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ బుక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పోలీస్ శాఖ ఐ.టి విభాగం రూపొందించిన ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచడం జరిగిందని డీజీపీ తెలిపారు. ఈ పుస్తకంలో తాజాగా జరుగుతున్న సైబర్ క్రైమ్ ల ఇన్వెస్టిగేషన్ , డిటెక్షన్ మెళుకువలు , చర్యలు మొదలైనవి ఉన్నాయని, ఈ పుస్తకం తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ వర్టికల్, సైబర్ వారియర్స్ సిబ్బందికి అవసరమైన అవగాహనను అందిస్తుందని డీజీపీ వివరించారు.
అనంతరం పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మరియు ఇతర సీనియర్ పోలీసు అధికారుల నుండి సైబర్ నేరాల నియంత్రణపై తీసుకోవలసిన చర్యల పై పలు సూచనలు చేయడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్, ఐజి లు రాజేష్ కుమార్, కమల్ హాసన్ రెడ్డి, ఐ.టి విభాగం డిఎస్పీ శ్రీనాథ్ రెడ్డి లు పాల్గొన్నారు.