హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్డేడియంలో నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకర్షిస్తుంది ప్రముఖులుసైతం బుక్ ఫెయిర్‌కు హాజరవుతున్నారు. తాజాగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల ఆలోచన, మేధస్సు పెరుగుతుందన్నారు. పిల్లలు తమ సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలను చదవాలన్నారు.
ఈ సందర్భంగా పబ్లికేషన్ డివిజన్ అధికారులను ఆయన ప్రశంసించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నవీన భారత నిర్మాణానికి సంబంధించిన పుస్తకాలు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర, ఇతర పలు రకాల పుస్తకాలను ప్రచురిస్తున్నందుకు ఆయన వారిని అభినందించారు. అంతేకాకుండా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రతి ఏటా బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు. మానసికంగా పరిణితిని పెంచడానికి పుస్తక పఠనం దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దత్తాత్రేయ సూచించారు.