గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్‌పీఎస్సీకి అందించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ విడుదలపై బీఆరే భవన్‌లో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డితోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గ్రూప్-4 క్యాడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన 5 శాతంలోనూ అత్యధిక పోస్టులు స్థానికులకే దక్కుతాయని ఆయన తెలిపారు. ఇటీవల గ్రూప్-1 కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నదని, టెట్ నిర్వహణకు విద్యాశాఖకు క్లియరెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు సోమేశ్‌కుమార్.