రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన పనుల పురోగతి, వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద పనులు పురొగతిని వేగవంతం చేసి పూర్తి చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను సి.ఎస్ అభినందించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీ జూన్ 12 లోగా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పాఠశాలలు తెరిచే రోజున ప్రతి విద్యార్ధికి నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. చిన్నపాటి మరమ్మతు పనులు, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, త్రాగునీరు, పెయింటింగ్, ఫర్నీచర్ పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు, సేకరణ గురించి సి.ఎస్ ప్రస్తావిస్తూ బ్యాలెన్స్ ధాన్యాన్ని త్వరగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు వేగంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొంత మంది జిల్లాల కలెక్టర్లు తీసుకున్న చర్యలను సి.ఎస్ అభినందించారు. ఇదే విధానాన్ని అనుకరించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, పంచాయత్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పౌర సరఫరాల శాఖ కమీషనర్ డిఎస్ చౌహాన్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ దివ్య, పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.