కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురైన ఘటన హైదరాబాద్ మాదాపూర్‌లోని గుట్టలభేగంపేట్ వడ్డెర బస్తీలో చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగడం వలనే బస్తీలో భీమయ్య అనే వ్యక్తి మృతి చెందాడని బస్తీ వాసుల ఆరోపణ చేస్తున్నారు. కలుషిత నీరు తాగడం వలన రాత్రి నుండి వాంతులు, విరేచనాలతో దాదాపు 20 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని బస్తీవాసులు వెల్లడించారు. కలుషిత నీటిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై వాటర్ వర్క్స్ అధికారులను వివరణ కోరగా నీటిలో ఎలాంటి కలుషితం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వివరాలు సేకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. బస్తీవాసులు మాత్రం కలుషిత నీటితో చాలా రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎన్ని సార్లు తమ గోడు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు వాపోతున్నారు.