తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలు పాదయాత్రలు చేయగా.. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా పాదయాత్రలు చేపట్టనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 33 జిల్లాల్లో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ వెల్లడించారు. ఈనెల 14 నుంచి 21 వరకు తెలంగాణ వ్యాప్తంగా 2,300 కిలోమీటర్లు మేర ప్రజాచైతన్య పాదయాత్ర చేయనున్నట్లు మధుయాష్కీ ప్రకటన చేశారు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై ప్రజలను చైతన్యం చేయడం కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతకంటే ముందు ఈనెల 9 నుంచి డీసీసీ మండల, టౌన్ అధ్యక్షులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
Read Also: అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం
మరోవైపు ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపుతారంటూ వస్తున్న వార్తలపై మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రను కలపాలని ఎవరూ మాట్లాడొద్దని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. అది సోనియా గాంధీ నిర్ణయంతో ఆవిష్కృతమైందని ఆయన తెలిపారు. అధికార దాహంతో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ, ఆంధ్రను కలపాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాలను కలపాలని జగ్గారెడ్డి మాట్లాడటం ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అది ఏ మాత్రం పార్టీ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంపై జగ్గారెడ్డిని వివరణ అడగ్గా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారని మధుయాష్కీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆకాంక్ష నెరవేరడం లేదనే విషయం జగ్గారెడ్డి అభిప్రాయమన్నారు. మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరని ప్రభుత్వాన్ని మధుయాష్కీ ప్రశ్నించారు. నిరుద్యోగుల సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరారు.