నాగార్జున సాగర్ లోని జానారెడ్డి ఇంట్లో ఇంఛార్జి ఠాగూర్ అధ్యక్షతన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం సభ, సాగర్ లో తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి… రేవంత్ హాజరయ్యారు.
పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దు
ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దని, సాగర్ నియోజకవర్గ పరిధి పొరుగున ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ ఏ స్థాయికి వస్తే.. మనం కూడా ఆ స్థాయికి వెళ్లాలని, మనకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య అని పేర్కొన్నట్టు సమాచారం. కెసిఆర్ సభ అట్టర్ ప్లాప్ అయిందని, జనం నుంచి స్పందన కూడా లేదని అన్నారు. సాగర్ కి జానారెడ్డి ఏం చేయలేదని చెప్పిన కేసీఆర్… ఏడేళ్ల లో ఏం చేశారో చెప్పలేదని, పసలేని పనులు…పనికి మాలిన మాటలు అంటూ ఎద్దేవా చేశారు.
రెండు రోజులు పార్టీ నాయకులు అలెర్ట్ గా ఉండాలి
రేవంత్ మాట్లాడుతూ పోలీసు యంత్రాంగంతోనే టీఆర్ఎస్ ఎన్నికలు చేయాలని చూస్తుందని, రేపు సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. కెసిఆర్ ఊహించిన స్థాయిలో సభ లేదని, దీని ప్రభావం.. పోలింగ్ మీద ఉంటుందని అన్నారు. కెసిఆర్ వ్యవహార శైలి…డిఫెన్స్ శైలిలో జరిగిందని, సాగర్.. హాలియాలో జానారెడ్డి తెచ్చినవి కెసిఆర్ తరలించారని అన్నారు. జానారెడ్డి తెచ్చిన కాలేజీలను కేసీఆర్ డిగ్రీ కాలేజీ చేస్తున్నారని అంతకు మించి చేసేది లేదని అన్నారు. వచ్చే రెండు రోజులు పార్టీ నాయకులు అలెర్ట్ గా ఉండాలని, మీ అందరికీ మేము అండగా ఉంటామని అన్నారు.
కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత మాది
జానారెడ్డి మాట్లాడుతూ ఏదేమైనా… ఈ ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకోవాలని, 2023 లో పార్టీ నీ పూర్వ వైభవాన్ని తేవాలని అన్నారు. నాకు అండగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన స్టార్ క్యాంపైనర్ లు అందరూ దేవరకొండ..మిర్యాలగూడ లలో ఉండండని, ఇంఛార్జి లు… ఆయా గ్రామాలలో మానిటరింగ్ చేయండని అన్నారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా… ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయండి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తున్నామన్న ఆయన కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత మాదని అన్నారు.
కాంగ్రెస్ విజయం సాగర్ నుండే మొదలు
ఇక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం, కెసిఆర్ నియంతృత్వం కి ఈ ఎన్నికలు పులిస్టప్ పెట్టబోతున్నాయని అన్నారు. వచ్చే రెండు రోజులు కీలకం ఇంఛార్జి లు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తున్నామన్న ఆయన కాంగ్రెస్ విజయం సాగర్ నుండే మొదలు కాబోతుందని అన్నారు.