NTV Telugu Site icon

రేవంత్‌కు పగ్గాలు… కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy

Komatireddy

కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చివరకు రేవంత్‌ రెడ్డిని కొత్త చీఫ్‌గా నియమించింది… అయితే, ఆది నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చిన.. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి… పీసీసీ చీఫ్‌పై చర్చ జరిగిన ప్రతీసారి ఢిల్లీ వెళ్లి మరీ మంతనాలు జరిపిన కోమటిరెడ్డికి పదవి మాత్రం దక్కలేదు.. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన.. ఈ సందర్భంగా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

అది టి.పీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిందంటూ ఫైర్‌ అయ్యారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… ఇకపై తాను గాంధీ భవన్‌ మెట్లెక్కను అంటూ శపథం చేశారు.. అంతేకాదు.. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని సూచించారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని ప్రకటించారు కోమటిరెడ్డి.. మరోవైపు పీసీసీ నియామకం విషయంలో.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అమ్ముడు పోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఓటుకు నోటు మాదిరిగా.. నోటుకు పీసీసీ మారిందంటూ విమర్శలు గుప్పించారు. ఈ నియామకంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే సందేశాన్ని ఇచ్చారంటూ విమర్శించిన ఆయన.. ఇప్పటి వరకు రాజకీయ భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలోని ఇబ్రహీంపట్నం నుంచి ప్రతీ గ్రామాన్ని తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తూ.. కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తానన్నారు.. తన నియోజకవర్గ ప్రజలే తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయిస్తారని వెల్లడించారు. ఇక, తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్‌ గాంధీపై మాత్రం విమర్శలు చేయనని ప్రకటించారు. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యవహారం చూస్తుంటే.. పార్టీలో ప్రకంపనలు తప్పవా? అనే చర్చ మొదలైంది.. మరోవైపు.. కాంగ్రెస్‌లో ఇలాంటివి టీకప్పులో తుఫాన్‌ లాంటివని కొట్టిపారేసేవారు లేకపోలేదు.