తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హైదరాబాద్ విచ్చేసిన విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలెవరూ కలవలేదు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు మాత్రం సిన్హాను కలిశారు. దీంతో వీహెచ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే బండకేసి కొడతామని వ్యాఖ్యానించారు. ఇది పిల్లలాట కాదని.. పార్టీ వ్యవహారమని అన్నారు. కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి ఎందుకు కలవాలని ప్రశ్నించారు. మన ఇంటికి వచ్చినప్పుడు మనం కలవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. యశ్వంత్ సిన్హాను వీహెచ్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. సిన్హాకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు తెలిపిందని, రాహుల్‌కు లేని అభ్యంతరం పీసీసీ చీఫ్‌కు ఎందుకని ప్రశ్నించారు. సిన్హా నామినేషన్ రోజు రాహుల్ పక్కన కేటీఆర్ కూడా ఉన్నారని ప్రస్తావించారు. బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ జగ్గారెడ్డి .. మేమేమైనా పాలేర్లమా మండిపడ్డారు.
Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి
బండకేసి కొట్టడానికి నువ్వు ఎవరూ? ఎవర్ని బండకేసి కొడతాడో చెప్పాలని ప్రశ్నించారు. పదవి లేకుంటే రేవంత్‌కు విలువే లేదన్నారు. ఒక్క స్టేట్ మీటింగ్ లేదు.. ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. వీహెచ్ వయసెక్కడా.. నీ వయసెక్కడా.. నువు పొరగానివి, పీసీసీ నుంచి రేవంత్‌ను తొలగించమని హైకమాండ్‌కు లేఖ రాస్తామని.. రేవంత్‌రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని జగ్గారెడ్డి అన్నారు. టెంప్ట్ అయ్యే వాడివి పీసీసీ పోస్టుకు ఎలా అర్హుడయ్యావని రేవంత్‌ను జగ్గారెడ్డి ప్రశ్నించారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.