CM Revanth Reddy : ప్రకృతిని.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అక్కాచెల్లెళ్లందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలతో తయారు చేసిన ఘనమైన బతుకమ్మలతో ఆడ బిడ్డలందరూ ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని అన్నారు.
ఈ పండుగ ప్రజల సాంస్కృతిక వైభవం, మహిళల ఐక్యతను చాటి చెప్పడంతో పాటు, అనేక సామాజిక అంశాలతో నిండి ఉందన్నారు. ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు రాష్ట్రమంతటా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడానికి, సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుందని సీఎం అన్నారు. ప్రకృతి పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని .. చెరువులు, కుంటలను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందిస్తుందని.. అందుకే బతుకమ్మ చెరువును పునరుద్దరించిందని గుర్తు చేశారు.