మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన మనకు అంతో ఇంతో చేయాలని ముందుకొస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి నే ఓర్వలేక పోతున్నారు. సైంధవుడిగా కిషన్ రెడ్డి ఉన్నాడు.” అని వ్యాఖ్యానించారు. వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు వన్నెతెచ్చాడనే కీర్తి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
READ MORE: Sankranthiki Vasthunnam: ఓటీటీలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త రికార్డ్
గతంలో వనపర్తి రాజకీయాల్లో కక్షలు, ధన ప్రభావం ఉండేది కాదు. ఐదేళ్ల క్రితం ఇక్కడి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయాలను కలుషితం చేశారు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మోడీ 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన మనకు అంతో ఇంతో చేయాలని ముందుకొస్తున్నారు. కానీ కిషన్ రెడ్డి నే ఓర్వలేక పోతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? లేదా? రైతులే చెప్పాలి. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. అయినా.. ఎక్కడా కూడా కోతలు విధించలేదు. రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామా? లేదా? మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాం. 65 లక్షల మంది మహిళలు స్వయంసహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సభ్యుల సంఖ్య కోటికి చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. కోటి మంది ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేయాలని కృషి చేస్తున్నాం.” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.