Site icon NTV Telugu

Raj Bhavan: ఒకే వేదికపైకి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్..!

Cm And Governor

Cm And Governor

తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య క్రమంగా గ్యాప్‌ పెరుగుతూ వచ్చింది.. ఈ పరిణామాలపై కొన్ని సందర్భాల్లో గవర్నర్‌ తమిళిసై బహిరంగంగానే పరోక్ష, ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. కొన్ని రోజులు ఏ విషయాలు బయటకు పొక్కపోయినా.. గ్యాప్‌ మాత్రం క్రమంగా పెరుగుతూ పోయింది.. దీంతో, గవర్నర్‌ ఆహ్వానించినా కొన్ని కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌తో పాటు అధికార పార్టీకి చెందినవారు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, గవర్నర్‌, ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. ఉదయం 10.05 గంటలకు రాజ్‌భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.. అయితే, ప్రొటోకాల్‌ ప్రకారం ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరు కావాల్సి ఉంది.. ఆయన హాజరైతే చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ను చూసే అవకాశం వచ్చినట్టు అవుతుంది.

Read Also: Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ

రాజ్‌భవన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నట్లు తెలుస్తుంది.. అయితే, గవర్నర్‌ తమిళిసై వైఖరిపట్ల సీఎం కేసీఆర్‌, అధికార పార్టీ నేతలు.. గత కొంత కాలంగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు.. సీఎం కేసీఆర్‌ గత ఏడాది అక్టోబరు 11వ తేదీన చివరిసారి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.. ఇక, అప్పటి నుంచి ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లింది లేదు.. అయితే, ఇవాళ ఆయన రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఒకే వేదికను పంచుకోనున్న గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ స్పందన ఎలా ఉంటుంది. అసలు సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతారా..? దూరంగానే ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version